: చంద్రబాబు ముందు గద్దె నిరసన గళం!... అధికారులకు చంద్రబాబు చీవాట్లు!


అధికార యంత్రాంగం అత్యుత్సాహం... టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి ముందు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిరసన గళానికి దారి తీసింది. ఫలితంగా అధికారులకు చంద్రబాబు చీవాట్లు పెట్టారు. వివరాల్లోకెళితే... విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిదిలోని కృష్ణా కరకట్టలపై టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారు. దాదాపు కోటి రూపాయలతో అప్పట్లో ఆ స్థలాల్లో పక్కా ఇళ్లను టీడీపీ ప్రభుత్వం నిర్మించింది. తాజాగా ఈ ఇళ్లు కృష్ణా పుష్కరాల సందర్భంగా చేస్తున్న సుందరీకరణ పనులకు అడ్డుగా వస్తున్నాయన్న భావనతో ఆ ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే వాటిని కూల్చేయడానికి పలుగు పార తీసుకుని జనం నిద్ర లేవకముందే ఇటీవల ఓ రోజు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ రావు చెవిన పడింది. వెనువెంటనే స్పందించిన ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము వచ్చామని అధికారులు చెప్పడంతో గద్దె ఫోనందుకున్నారు. లైన్లోకి వచ్చిన బెజవాడ మునిపిసల్ కార్పొరేషన్ కమిషనర్ వీరపాండ్యన్ కూడా ఇదే సమాధానం ఇచ్చారు. అయితే గద్దె ఆగ్రహంతో అప్పటికప్పుడు ఇళ్ల కూల్చివేతను తాత్కాలికంగా వాయిదా వేసిన అధికారులు వెనక్కెళ్లారు. ఇక లాభం లేదనుకున్న గద్దె నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లారు. గద్దెతో పాటు ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా చంద్రబాబు వద్దకు వెళ్లారు. మొత్తం విషయాన్ని ఏకరువు పెట్టిన గద్దె... ‘‘మనం స్థలాలిచ్చి మన ప్రభుత్వమే కట్టించిన ఇళ్లను మనమే కూల్చివేస్తే ఎలా?’’ అని చంద్రబాబు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వెనువెంటనే ఫోనందుకున్న చంద్రబాబు సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు చెప్పకుండా పేదల ఇళ్ల కూల్చివేతకు ఎలా వెళతారంటూ చంద్రబాబు ప్రశ్నించడంతో అధికారుల నోట మాట రాలేదట. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటే ఉపేక్షించేది లేదని చంద్రబాబు అధికార యంత్రాంగానికి వార్నింగిచ్చారట.

  • Loading...

More Telugu News