: పెళ్లి రుణం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం.. కుటుంబం ఆత్మహత్య
కుమార్తెకు పెళ్లి చేసేందుకు అప్పు కోసం చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తమిళనాడులోని కాంచీపురం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కట్టుపత్తూరుకు చెందిన ముత్తు(58) రైతు. అతనికి భార్య సరస్వతి(50), కుమార్తె ఇందుమతి(28), కుమారుడు కామేష్(25) ఉన్నారు. బీఏ, బీఈడీ పూర్తిచేసిన ఇందుమతి మధురమంగళం గ్రామం వీఏఓగా పనిచేస్తుండగా ఇంజినీరింగ్ పూర్తిచేసిన కామేష్ ఉద్యోగ వేటలో ఉన్నాడు. ఇందుమతికి పెళ్లి చేయాలని భావించిన ముత్తు అందుకు కావాల్సిన డబ్బుల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ఇప్పటికే పిల్లల చదువుల కోసం రుణాలు తీసుకోవడంతో మళ్లీ ఇచ్చేందుకు చాలామంది నిరాకరించారు. ఇందుమతికి పెళ్లై వెళ్లిపోతే అప్పు ఎవరు తీరుస్తారన్న ఉద్దేశంతో డబ్బులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఇందుమతి వివాహం విషయంలో కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో దీనంతటికీ కారణం తానేనని భావించిన ఇందుమతి కుటుంబ సభ్యుల ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె మృతిని చూసి తట్టుకోలేని తండ్రి, తల్లి, కుమారుడు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మధ్యాహ్నమైనా కుటుంబ సభ్యులు ఎవరూ బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగువారు వెళ్లి చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.