: ఆల్మట్టి నుంచి నారాయణపూర్ దాటి జూరాలకు కృష్ణమ్మ పరుగులు... రేపు శ్రీశైలానికి!
కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు, కృష్ణానది పరుగులు తీస్తూ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసింది. ఆల్మట్టి పూర్తిగా నిండటంతో 1.19 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీరు కిందకు పరుగులు పెడుతూ నారాయణపూర్ చేరుతోంది. నారాయణపూర్ నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, పూర్తిగా నిండింది. అక్కడి నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా వదులుతుండగా, నీరు జూరాలకు చేరుతోంది. జూరాలలో మరో 4 టీఎంసీల నీరు చేరితే ప్రాజెక్టు నిండి నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తారు. ఈ మధ్యాహ్నానికి జూరాల నిండుతుందని, రేపటికి శ్రీశైలానికి వరద నీటి ప్రవాహం చేరడం మొదలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 215 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీశైలంలో ప్రస్తుతం కేవలం 24 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం పూర్తిగా నిండి, నీరు నాగార్జున సాగర్ కు రావాలంటే, ఇదే నీటి ప్రవాహం వారం రోజులకు పైగా కొనసాగాల్సి ఉంటుంది.