: 'ఎల్ అండ్ టీ'కి బెజవాడ డ్రైనేజీ పనులు!... 4.99 ఎక్సెస్ తో టెండర్ దక్కించుకున్న నిర్మాణ రంగ దిగ్గజం!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటవుతున్న తాత్కాలిక సచివాలయం పనుల్లో సగ భాగాన్ని దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీ లార్సెన్ అండ్ టూర్బో (ఎల్ అండ్ టీ) మరో కీలక కాంట్రాక్టును హస్తగతం చేసుకుంది. నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ గా కొత్త రూపు దిద్దుకున్న విజయవాడలో సమగ్ర మురుగునీటి డ్రైనేజీ నిర్మాణ పనులను ఆ సంస్థ దక్కించుకుంది. నగరంలో వర్షాకాలంలో డ్రైనేజీ పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఈ క్రమంలో నగరంలో సమగ్ర డ్రైనేజీ నిర్వహణ కోసం ఓ కొత్త వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. ఈ మేరకు రూ.345.18 కోట్లతో సమగ్ర మురుగునీటి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం ఇటీవలే టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో పాల్గొన్న ఎల్ అండ్ టీ... 4.99 శాతం ఎక్సెస్ కు బిడ్ దాఖలు చేసింది. నిన్న ఓపెన్ చేసిన ఈ టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసిన ఎల్ అండ్ టీకే ఈ పనులు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News