: బీహార్‌లో భారీ ఎన్‌కౌంటర్: 8 మంది భద్రతా సిబ్బంది, నలుగురు మావోలు మృతి
బీహార్‌లో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది భద్రతా సిబ్బంది, నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఔరంగాబాద్, గయ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన దుమారిలోని నల అడవిలో జరిగిన ఈ భారీ ఎన్‌కౌంటర్ దాదాపు రోజంతా సాగింది. మావోలు ఒక్కసారిగా 17 ఈఐడీలను పేల్చడంతో 8 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. గాయపడిన జవాన్లను తరలించేందుకు హెలికాప్టర్‌ను పంపినా మావోలు కాల్పులు జరుపుతుండడంతో హెలికాప్టర్ తిరిగి పట్నా చేరుకున్నట్టు సమాచారం. మావోల కోసం భద్రతా సిబ్బంది గత రెండు రోజులుగా అడవిని జల్లెడపడుతున్నారు. ఈ నేపథ్యంలో సందీప్ జీ ఆధ్వర్యంలో బిహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ(బీజేఎస్ఏసీ) ఈఐడీలు పేలుస్తూ కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు అడవిలో చిక్కుకుపోయాయి. భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు దిగి నలుగురు మావోలను మట్టుబెట్టారు. ఇరువర్గాల మధ్య భారీగా కాల్పులు చోటుచేసుకున్నట్టు మగధ రేంజ్ డీఐజీ సౌరభ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో 8మంది భద్రతా సిబ్బంది, నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుండగా వివరాలను వెల్లడించేందుకు డీఐజీ నిరాకరించారు.