: సామాజిక మాధ్యమాలు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి: జైట్లీ
సామాజిక మాధ్యమాలు ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా జమ్మూకాశ్మీరీలకు మౌలిక సదుపాయాలు అందకుండా చేస్తున్నారని, ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారని కాంగ్రెస్ నేత ఆజాద్ ఆరోపించారు. దీనికి సమాధానమిచ్చిన సందర్భంగా అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, సమాచార నియంత్రణకు ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్నప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. జమ్మూకాశ్మీర్ లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందించాలని తమకు కూడా ఉందని ఆయన చెప్పారు. కానీ సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం అవుతున్నాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను ఆశ్రయించే యువకులే లక్ష్యంగా ఉగ్రప్రచారం జరుగుతోందని, దీని పట్ల యువత సులువుగా ఆకర్షితులవుతున్నారని ఆయన తెలిపారు. అందుకే వాటిని నిలుపుదల చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన చెప్పారు. కాశ్మీర్ లో ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించిన వారు, అక్కడ పోలీస్ స్టేషన్లు, పోలీసులపై జరుగుతున్న రాళ్ల దాడులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నది అల్లరి మూకలకు చెందిన కాశ్మీరీలేనని, ప్రభుత్వం ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని, సాధారణ జనజీవనం స్తంభించకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. ఆయన వాదనకు అన్నిపక్షాల నుంచి మద్దతు లభించడం విశేషం.