: తెల్లగా కనబడేందుకు మైఖేల్ జాక్సన్ ఏమి చేసేవాడంటే...!
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తెల్లగా కనపడటం కోసం బ్లీచింగ్ క్రీమ్ రాయించుకునేవాడట. అది కూడా తన కూతురు పారిస్ నే ఈ క్రీమ్ రాయమనేవాడని మైఖేల్ జాక్సన్ కు వ్యక్తిగత వైద్యుడిగా పని చేసిన కానార్డ్ ముర్రే పేర్కొన్నారు. మైఖేల్ జాక్సన్ మృతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బయటకు వచ్చిన ఆయన రాసిన తాజా పుస్తకం ‘దిస్ ఈజ్ ఇట్’ లో పాప్ కింగ్ కు సంబంధించిన పలు వ్యక్తిగత విషయాలను ఆయన వెల్లడించారు. మైఖేల్ జాక్సన్ తన కూతూరితోనే ఈ క్రీమ్ రాయించుకోవడానికి కారణాన్ని కూడా ఈ పుస్తకంలో ఆయన చెప్పారు. ఆ క్రీమ్ రాసేటప్పుడు అది చేతికి తగిలితే చర్మం పాడవుతుంది. నల్లగా ఉండే తన కొడుకులు ప్రిన్స్, బ్లాంకెట్ లు ఈ క్రీమ్ ని రాసేటప్పుడు వారి చేతులకు తగిలితే వారి చర్మం పాడవుతుందని, అదే, తెల్లగా ఉండే తన కూతురు పారిస్ రాస్తే ఒకవేళ ఆ క్రీమ్ ఆమె చేతికి అంటుకున్నప్పటికీ, అంత ప్రమాదమేమీ ఉండదని మైఖేల్ జాక్సన్ భావించేవాడని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. తాను కూడా చాలాసార్లు ఆయనకు బ్లీచింగ్ క్రీమ్ రాశానని, అయితే, గ్లోవ్స్ ధరించే వాడినని తెలిపిన ముర్రే, పారిస్ తో ఆ క్రీమ్ రాయించుకోవద్దని మైఖేల్ జాక్సన్ ని చాలాసార్లు హెచ్చరించానని పేర్కొన్నారు.