: చిత్తూరు జిల్లాలో క్రికెట్ చిచ్చు ... రెండు గ్రామాల యువకుల ఫైటింగ్


రెండు గ్రామాల యువకులు సరదాగా క్రికెట్ ఆడుకుంటుండగా తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసిన సంఘటన చిత్తూరు జిల్లా ఎగువ గెరిగిదొనలో నిన్న రాత్రి జరిగింది. వెదురుకుప్పం మండల పరిధిలోని మాంబేడు గ్రామ పంచాయతీలోని ఎగువ గెరిగిదొన, సౌడేపల్లి గ్రామాలకు చెందిన యువకులు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరు గ్రామాల యువకుల మధ్య వివాదం తలెత్తింది. అయితే, అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు వారికి సర్దిచెప్పడంతో సౌడపల్లి యువకులు అక్కడి నుంచి తమ గ్రామానికి వెళ్లిపోయారు. కానీ, ఈ సంఘటనని జీర్ణించుకోలేకపోయిన సౌడేపల్లి యువకులు ఇంకొంతమందిని తీసుకుని నిన్న రాత్రి ఎగువ గెరిగిదొన గ్రామానికి వెళ్లి దాడికి పురిగొల్పారు. దీంతో, రెండు గ్రామాల యువకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న సులోచనమ్మ అనే మహిళ, ఈ గొడవల్లో తమ పిల్లలేమైనా ఉన్నారేమోనని చెప్పి అక్కడికి వెళ్లింది. అక్కడ జరుగుతున్న గొడవలు చూసి ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత జరిగిన తొక్కిసలాటలో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో సులోచనమ్మను చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. ఈ గొడవల కారణంగా ఆ గ్రామంలో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News