: నేటి చారిత్రక సన్నివేశానికి అందరం సాక్షులం: చంద్రబాబు
గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా విడుదలైన నీరు నేడు కృష్ణమ్మను తాకనుందని, దేశ నదుల అనుసంధాన చరిత్రలో ఇదో మహత్తర ఘట్టమని, దీనికి ఈ తరమంతా సాక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి నీరు - చెట్టు ప్రగతిపై 8 వేల మంది అధికారులు, సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. చేపట్టిన నదుల అనుసంధానం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. ఇక చెరువుల అనుసంధానంపై అధికార యంత్రాంగం దృష్టిని సారించాలని ఏ రైతు కూడా కరవుతో ఇబ్బంది పడకూడని పరిస్థితి కల్పించాలని సూచించారు. గొలుసుకట్టుగా చెరువులను కలిపే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. పట్టిసీమ ద్వారా రోజుకు 10 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా జిల్లా అవసరాలకు వినియోగించుకోనున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. మూడు రోజుల్లో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు చేరుతుందని, ఈ నీటిని రాయలసీమకు తీసుకొస్తామని తెలిపారు. అన్ని కాలువల నిర్వహణ పక్కాగా, పకడ్బందీగా జరగాలని అధికారులను బాబు ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ అనంతరం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.