: 47 శాతం మంది భారతీయులు పొదుపుకి దూరం!


రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత గురించి చాలామంది భారతీయులు ఆలోచించడం లేదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దాదాపు 47 శాతం మంది భారతీయులు ‘భవిష్యత్తు’ గురించి పొదుపు చేసుకోవడం లేదని తేలింది. పొదుపు చేయడంలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటుండడమో, మధ్యలో ఆపేయడమో, లేక పూర్తిగా చేయకపోవడమో జరుగుతోందని తేల్చింది. ‘‘ఉద్యోగాలు చేస్తున్న వారిలో 47 మంది ఇప్పటి వరకు రిటైర్మెంట్ కోసం పొదుపు ప్రారంభించలేదు. సేవింగ్స్ విషయంలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్త సగటు కంటే ఇది చాలా ఎక్కువ’’ అని హెచ్ఎస్బీసీ సర్వే పేర్కొంది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఈజిప్ట్, ఫ్రాన్స్, హాంగ్ కాంగ్, ఇండియా, ఇండోనేషియా, మలేషియా, మెక్సికో, సింగపూర్, తైవాన్, యూఏఈ, బ్రిటన్, అమెరికా తదితర 17 దేశాల్లో 18,207 మందిని సర్వే చేశారు. హెచ్ఎస్బీసీ నివేదిక ప్రకారం.. భారత్ లో 44 శాతం మంది ఉద్యోగులు రిటైర్మెంట్ కోసం చేసిన పొదుపును ఆర్థిక కారణాలతో మధ్యలోనే ఆపేశారు. 21 శాతం మంది ఇప్పటి వరకు సేవింగ్ అన్న ఊసే ఎత్తలేదు. 60 ఏళ్లు, ఆపైబడిన వయసున్న వాళ్లలో 22 శాతం మంది, 50 ఏళ్ల వయసున్న వారిలో 14 శాతం మంది రిటైర్మెంట్ కోసం సేవింగ్ చేయలేదని నివేదిక పేర్కొంది. ఉద్యోగాలు చేస్తున్న వారిలో పదిశాతం మంది రిటైర్మెంట్ తర్వాత భవిష్యత్ అవసరాలపై ఇప్పటి వరకు ఎవరి సలహాలూ తీసుకోలేదు. అయితే ఆశ్చర్యకరంగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్న వారిలో 80 శాతం మంది మాత్రం ఈ విషయంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటున్నారట. ముందస్తు రిటైర్మెంట్ తీసుకున్న వారిలో 40 శాతం మంది, రిటైరైన వారిలో 53 శాతం మంది ఆర్థిక నిపుణుల నుంచి రిటైర్మెంట్ పై సలహాలు తీసుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైంది.

  • Loading...

More Telugu News