: తాగి వాహనం నడిపితే తాట తీసేందుకు తెలంగాణ పోలీసులు రెడీ... జరిగేది ఇదే!
డ్రంకెన్ డ్రైవింగ్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. తాగి నడుపుతూ పట్టుబడితే, జరిమానా, శిక్షలతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. అదే చదువుకుంటున్న వారు పట్టుబడితే విద్యాసంస్థలకు, ఉద్యోగాలు చేస్తుంటే, వారు పనిచేసే సంస్థలకు సమాచారం అందిస్తారు. పాస్ పోర్టులు జారీ చేసే కేంద్రాలకు, వీసాలను జారీ చేసే వివిధ దేశాల ఎంబసీలకూ సమాచారాన్ని పంపుతారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చూసే, టీఎస్ పీఎస్సీ, ప్రైవేటు ఉద్యోగ నియామక సంస్థలకు, వీరు తాగుబోతులని ముందే చెప్పేస్తారు. ఈ నెల ప్రారంభంలో పంజాగుట్టలో తీవ్ర ప్రమాదం జరగడం, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన నేపథ్యంలో సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, తాగి వాహనాలు నడిపే వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. పెళ్లయిన వ్యక్తి పట్టుబడితే అతని భార్యను, భార్య పట్టుబడితే భర్తను స్టేషనుకు పిలిచి క్లాస్ పీకాలని, అవివాహితులు పట్టుబడితే వారి తల్లిదండ్రులను కౌన్సెలింగ్ కు పిలవాలని, మైనర్లు పట్టుబడితే, వారి పేరెంట్స్, మద్యం అమ్మిన షాపు లేదా బార్ యాజమాన్యం సైతం కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి వుంటుంది. ఇక ప్రమాదాలు చేసే వారికి కఠిన శిక్షలు పడేలా రక్త నమూనాలు, వైద్యుల నివేదిక, ఆపై 304-2 సెక్షన్లు కేసునకు జోడిస్తారు. దీంతో వారికి విదేశీ అవకాశాలు, ఉన్నత విద్యావకాశాలు దెబ్బతింటాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే, వాహన యజమానికి శిక్ష తప్పదు. ఈ నిర్ణయాలన్నీ వారం రోజుల్లో అమల్లోకి తీసుకువస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.