: గడ్డం గీసుకుంటావా.. చచ్చిపొమ్మంటావా?: మతాధికారికి భార్య బెదిరింపులు!


గడ్డం గీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ మతాధికారిని భార్య బెదిరించిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. ఓ మసీదులో ప్రార్థనలు నిర్వహించే అర్షద్ బద్రుద్దీన్(36)కు భార్య నుంచి ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. గెడ్డాన్ని తీసేసి బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లలా ఉండాలని తరచూ వేధిస్తోందని జిల్లా మెజిస్ట్రేట్(డీఎం) కు భర్త లేఖ రాశారు. రాత్రీ పగలు తేడా లేకుండా వేరే వ్యక్తితో ఆమె సెల్ ఫోన్ లో చాట్ చేస్తూ గడుపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన డీఎంకు రాసిన లేఖ ప్రకారం.. ‘‘నేను మతాధికారిని. ఓ మసీదులో ప్రార్థనలు జరిపిస్తుంటా. ఇస్లాంను విశ్వసిస్తా. హరిపూర్ జిల్లాకు చెందిన సహానా(33)ను 2001లో పెళ్లి చేసుకున్నా. వివాహం తర్వాత నుంచి తనను గెడ్డం తీసేయాలని ఆమె వేధించడం మొదలు పెట్టింది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ లా ఉండాలని అంటోంది. అంతేకాదు ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కొచ్చి రాత్రీ పగలూ దాంతోనే గడుపుతోంది. నేను చాలాసార్లు ఆమెను సముదాయించే ప్రయత్నం చేశా. అయినా ఆమె తీరు మారలేదు. నలుగురు పిల్లలు పుట్టినా ఆమె ధోరణి ఏమాత్రం మారలేదు. ఇప్పటికీ అదే పోరు. గెడ్డం తీసేయాలని ఒకటే గోల. మొన్న రంజాన్ పండుగ సమయంలో పిల్లలకు మాడ్రన్ డెస్సులు కొనాలని గోల చేసింది. ఈద్ తర్వాత రోజు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. చూశాను కాబట్టి సరిపోయింది. ఆమె ఎప్పుడు ఏం చేసుకుంటుందోనని భయంగా ఉంది. అర్జెంటుగా గెడ్డం తీసేయకుంటే పిల్లలకు విషమిచ్చి తాను కూడా తీసుకుంటానని బెదిరిస్తోంది. మీరు స్పందించి ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటారని కోరుతున్నా’’ అని డీఎంకు లేఖ రాశారు. ఆయన దానిని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ)కి పంపించారు. ఈ విషయంలో వెంటనే దర్యాప్తునకు ఆదేశించినట్టు డీఎం దినేష్ చంద్ర తెలిపారు.

  • Loading...

More Telugu News