: బిరబిరా కృష్ణమ్మ పరుగులు... నిండిన ఆల్మట్టి, నిండుకుండ నారాయణపూర్!
నిన్నమొన్నటి వరకూ బోసిపోయిన కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు ఇప్పుడిప్పుడే జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి జలాశయానికి వస్తున్న వరదనీరు 1,88,940 క్యూసెక్కులకు చేరింది. దీంతో ఆల్మట్టి డ్యాం రెండు అడుగులు మినహా పూర్తిగా నిండింది. 129.7 టీఎంసీల సామర్థ్యముండగా, ఇప్పటికే 112 టీఎంసీలకు పైగా నీరు చేరింది. వచ్చిన నీటితో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించిన కర్ణాటక సర్కారు, దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతోంది. ఈ నీటితో నారాయణపూర్ జలాశయం నిండుకుండలా మారుతోంది. 37.64 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యమున్న జలాశయంలో ప్రస్తుతం 25 టీఎంసీల నీరుంది. నేటి మధ్యాహ్నానికి నారాయణపూర్ పూర్తిగా నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాలకు ఎలాంటి ఇన్ ఫ్లో లేకున్నా, 70 క్యూసెక్కులను కిందకు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టులు నిండితే, శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు తరలుతుంది.