: ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గిందో తెలుసా? తనను విమర్శిస్తున్న వారిపై తొలిసారిగా స్పందించిన రఘురాం రాజన్
తనను విమర్శిస్తున్న రాజకీయ పార్టీల నేతలే లక్ష్యంగా ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ తొలిసారి నోరు విప్పారు. తనను విమర్శించే వారు ఇండియాలో ద్రవ్యోల్బణం ఎందుకు తగ్గిందో తెలుసుకోవాలని అన్నారు. ఏవైనా విమర్శలతో కూడిన డైలాగులు వదిలే ముందు, ముందూ వెనుకా ఆలోచించాలని, ఆర్థిక వృద్ధిని పరిశీలించాలని సలహా ఇచ్చారు. కొందరు జర్నలిస్టులతో మాట్లాడిన ఆయన, రెండు సంవత్సరాలు వరుసగా కరవు పీడించినా, బ్రెగ్జిట్ విజయవంతమైనా, భారత మార్కెట్ పెద్దగా స్పందించలేదని గుర్తు చేస్తూ, అందుకు ఆర్బీఐ నిర్ణయాలే కారణమని అన్నారు. ఆర్బీఐ వైఖరే స్టాక్ మార్కెట్ ను పట్టి నిలిపిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పనితీరు ఇప్పుడు మరింతగా మెరుగుపడిందని, దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగిందని, వృద్ధి రేటు 7.6 నుంచి 8 శాతం వరకూ అంచనాలు ఉన్నాయంటే అది రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాల వల్లేనని అన్నారు.