: న్యూఢిల్లీని భారత్ లో ఉన్న పాకిస్థాన్ లా చూస్తున్న మోదీ: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్య


న్యూఢిల్లీని భారత్ లో ఉన్న పాకిస్థాన్ మాదిరిగా నరేంద్ర మోదీ చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 'టాక్ టు ఏకే' పేరిట ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి, పాకిస్థాన్ కు మధ్య ఎలాంటి బంధం ఉందో, ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య అటువంటి బంధమే కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఎమ్మెల్యేల వేతనాలను అంత ఎక్కువగా ఎందుకు పెంచారన్న ప్రశ్నకు, కేవలం రూ. 12 వేలు జీతం తీసుకుని పనిచేసే ప్రజా ప్రతినిధులకు రూ. 50 వేలు వేతనంగా ఇవ్వాలని నిర్ణయించామని గుర్తు చేసిన ఆయన, దొరికిన ప్రతిచోటా చెయ్యి చాచకుండా ఎమ్మెల్యేలను చూడాలన్నది తన అభిమతమని, పాత జీతాలు ఒక్క అసిస్టెంట్ ను పెట్టుకునేందుకు కూడా సరిపోదని అన్నారు. రూ. 50 వేల జీతం ఎక్కువని భావిస్తున్నారా? అని ప్రశ్నించి 'కాదు' అన్న సమాధానాన్ని రప్పించారు. నాలుగు నెలల క్రితం తమ ప్రాంతంలో పైప్ లైన్ చెడిపోయిందని ఫిర్యాదు చేస్తే, ఇంతవరకూ ఎవరూ పట్టించుకోలేదని తుగ్లకాబాద్ నుంచి ఓ యువకుడు ఫిర్యాదు చేయగా, రేపే అధికారులను పంపుతానని హామీ ఇచ్చారు. ప్రజలడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సుపరిపాలనకు కేంద్రం సహకరిస్తే, మరో నాలుగు మార్లు ఆప్ ప్రభుత్వమే పాలిస్తుందని కేజ్రీవాల్ అన్నారు.

  • Loading...

More Telugu News