: 'రెయిన్ ట్రీ'నే కావాలంటూ వరుస కట్టిన ఏపీ ఐఏఎస్ లు!
అమరావతి ప్రాంతం నుంచి పరిపాలన సాగించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకోగా, విజయవాడకు వస్తున్న ఐఏఎస్ అధికారుల్లో అత్యధికులు, తమకు రెయిన్ ట్రీ అపార్టుమెంట్లలోనే వసతి కావాలని పట్టుబడుతున్నారు. అధికారులకు వసతి ఏర్పాట్లను ప్రభుత్వం స్వయంగా చేపట్టడంతో, రెయిన్ ట్రీ తమకు కావాలంటే, తమకు కావాలని క్యూ కడుతున్నారు. ఇప్పటివరకూ వసతి నిమిత్తం 766 అప్లికేషన్లు రాగా, అందులో 316 అప్లికేషన్లు రెయిన్ ట్రీ కోసమే ఉండటం గమనార్హం. సీనియర్ ఐఏఎస్ అదికారులైన మన్మోహన్ సింగ్, జేసీ శర్మ, అజయ్ కల్లం, పీవీ రమేశ్, అనిల్ చంద్ర, దినేశ్ కుమార్, ఎస్వీ ప్రసాద్, శ్రీ నరేశ్, లవ్ అగర్వాల్, అనంతరాము, బిస్వాస్, రిజ్వి, గోపీనాథ్, సుందర పాండే, రమణమూర్తి, రత్నాకర్ జౌహరి, సుధాకర్, కేఎస్ రెడ్డి తదితరులు రెయిన్ ట్రీని ఎంచుకున్నారు. అప్లికేషన్ పెట్టుకునేందుకు ఈ నెల 20 వరకూ సమయముండగా, మరింతమంది ఉన్నతాధికారులు రెయిన్ ట్రీని ప్రిఫర్ చేస్తారని భావిస్తున్నారు.