: మా రాష్ట్రానికి రండి... తెలంగాణ ప్రజలను ఆహ్వానించిన పైడికొండల
కృష్ణా పుష్కరాలు మూడు వారాల్లో ప్రారంభ కానున్న వేళ, తమ రాష్ట్రంలో ఏర్పాటైన పుష్కర ఘాట్లకు తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని ఏపీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆహ్వానం పలికారు. బెజవాడ కనకదుర్గమ్మకు శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్న వేళ, హైదరాబాద్ అమ్మవారి ఆలయాల ఉమ్మడి కమిటీ తరఫున బోనాలు సమర్పించగా, వారికి మాణిక్యాలరావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, దుర్గమ్మకు బోనాల సమర్పణతో తెలుగు వారంతా ఒకటేనన్న అభిప్రాయం పెరుగుతుందని అన్నారు. పుష్కరాలకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి విజయవాడ, అమరావతి, శ్రీశైలం తదితర ప్రాంతాలకు భారీగా యాత్రికులు వస్తారని భావిస్తున్నామని, వారి కోసం ప్రత్యేక బస్సులను సైతం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. నదికి ఏపీ వైపున ఉన్న ఘాట్ల నిర్మాణం, సుందరీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మరో పది రోజుల్లో అన్ని పనులూ పూర్తవుతాయని భావిస్తున్నామని తెలిపారు.