: మోదీ నామస్మరణ వింటూ, ఆటను ఎంజాయ్ చేసిన రాహుల్ గాంధీ!
ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్స్, భారత స్టార్ విజేందర్ సింగ్ ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ పోటీని తిలకించేందుకు హాజరైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాతో కలసి వచ్చిన రాహుల్ గాంధీని చూసిన పలువురు క్రీడాభిమానులు 'మోదీ... మోదీ' అంటూ ప్రధాని పేరును పదేపదే పలకడం ప్రారంభించారు. ముఖ్యంగా రాహుల్ కూర్చున్న ప్రాంతానికి వెనుకవైపు నుంచి ఈ మోదీ నామస్మరణ వినిపించింది. దీంతో కొంత ఇబ్బందికరంగా కదిలిన రాహుల్, ముఖంపై చిరునవ్వును మాత్రం చెరగనీయలేదు. మ్యాచ్ మధ్యలో తన దగ్గరకు వచ్చిన చిన్నారులకు ఆటోగ్రాఫ్ లు ఇస్తూ గడిపిన ఆయన, మ్యాచ్ అనంతరం నవ్వుతూనే వెనక వైపు కూర్చుని మోదీ పేరు జపించిన వారివైపు ఓ లుక్కేస్తూ స్టేడియాన్ని వీడారు.