: తమిళనాట పేదల కోసం 'అమ్మ' సినిమా హాల్స్... టికెట్ రూ. 10, 20, 30!
ఇప్పటికే తమిళనాట పేదల కోసం వివిధ స్కీములు ప్రవేశపెట్టిన జయలలిత సర్కారు, తాజాగా వినోదాన్ని దగ్గర చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మల్టీప్లెక్స్, మాల్స్ సంఖ్య పెరిగిపోవడం, ఇక్కడ చిత్రాలు చూడాలంటే రూ. 125 చెల్లించాల్సి వుండటంతో జయలలిత పేదల కోసం అమ్మ సినిమా హాల్స్ కాన్సెప్టును తెరపైకి తెచ్చారు. వాస్తవానికి చెన్నైలోని మల్టీప్లెక్సుల్లో తెరముందు ఒక వరుస సీట్లు రూ. 10కే విక్రయిస్తున్నప్పటికీ, సీట్ల సంఖ్య చాలా తక్కువ కావడంతో పేదలు వినోదాన్ని పొందలేకపోతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అమ్మ సూచనల మేరకు చెన్నై కార్పొరేషన్ కనుసన్నల్లో నడిచేలా రెండు థియేటర్లు ప్రారంభమయ్యాయి. టీ నగర్, పెనాయ్ నగర్ లో భారీ థియేటర్లను సర్కారు సిద్ధం చేసింది. దాదాపు 3 వేల మంది ఒకేసారి సినిమా చూసేలా పెనాయ్ నగర్, కలై అరంగం హాల్ ను రూ. 17 కోట్లకు పైగా వెచ్చించి మార్పులు చేర్పులు చేశారు. ఇక్కడ టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 30 మధ్య మూడు క్లాసులుగా ఉంటుంది. డీటీఎస్ వంటి సదుపాయాలూ ఉంటాయి. వీటితో పాటు ముగప్పేర్, చేట్ పట్ ప్రాంతాల్లోనూ అమ్మ హాల్స్ నిర్మించే యోచనలో సర్కారు ఉంది.