: ఎవరితోనైనా నన్ను పోల్చుకుంటే అది ఏదో తప్పుగా ఫీలవుతా: అక్షయ్ కుమార్
బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ కి ఓ ప్రత్యేక స్థానం ఉంది. నటనలో ఎన్నో ప్రయోగాలు చేసే హీరోల్లో 'అక్షయ్ కుమార్' ఒకరు. విలక్షణమైన పాత్రల్లో కనబడుతూ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటాడు. అక్షయ్ కుమార్ ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. అయినప్పటికీ ఓ స్టార్ హీరో అనే గర్వమే అతనిలో కనపడదు. తాజాగా తన గురించి పలు విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ‘నేను నంబర్ గేమ్ గురించి ఆలోచించను, అలాగే నేనెవ్వరితోనూ నన్ను పోల్చుకోను’ అని అక్షయ్ చెప్పాడు. ఎవరితోనైనా తనను పోల్చుకుంటే అది ఏదో తప్పుగా ఫీలవుతానని అక్షయ్ అన్నాడు. తానేంటో తనకి తెలుసని, తాను పడే కష్టమే తనకు ప్రతిఫలం ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. తాను ఇప్పుడున్న స్థానంపై తనకు సంతృప్తి ఉందని, తాను వీలైనంత వరకు కష్టపడుతూనే ఉంటానని చెప్పాడు. తన జీవితంలో తిరిగిన ప్రతి మలుపులో తన కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉందని అక్షయ్ పేర్కొన్నాడు. ఈ అంశమే తనని కాపాడుతుందని ఆయన అన్నాడు. తాను ఒకవేళ ఇంటికి రాకుండా తన పనిలోనే మునిగిపోయి ఉంటే.. ఇప్పుడున్న స్థానంలో సగం కూడా ఎదగలేకపోయేవాడినేమోనని అక్షయ్ చెప్పాడు.