: 14 ఏళ్ల వయసులోనే ప్రపంచ పర్యావరణవేత్తగా ప్రశంసలు అందుకుంటున్న కుర్రాడు!
ఆడుతూ, పాడుతూ అల్లరి చేయాల్సిన వయసు. స్కూలు నుంచి ఇంటికి.. మళ్లీ ఇంటి నుంచి స్కూలుకి వెళ్లాల్సిన ఓ విద్యార్థి ఆ అబ్బాయి. కానీ మామూలు పిల్లలకు భిన్నంగా ఆలోచిస్తాడు. తన ప్రదర్శనలతో పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ చిన్ని పర్యావరణవేత్త చెబుతోన్న విషయాలతో ఎంతో మంది ప్రజలు మేల్కొంటున్నారు. పర్యావరణ సంరక్షణ ఆవశ్యకతను తెలుసుకుంటున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఆ పద్నాలుగేళ్ల బాలుడి పేరు గ్జిటెజ్‌కాట్ల్ రోస్క్ మార్టింజ్. వాతావరణం కలుషితం కాకుండా ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని తనదైన రీతిలో బోధిస్తున్నాడు పర్యావరణం విషయంలో ఎంతో జాగృతి అవసరమని గ్జిటెజ్‌కాట్ల్ చెబుతున్నాడు. భవిష్యత్తు తరాలు ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించాలంటే మనం ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించాల్సిందేనని చెబుతున్నాడు. ఉపాధ్యాయులతో చెప్పించుకోవాల్సిన వయసులో వారికే పాఠాలు బోధిస్తున్నట్లుగా పర్యావరణ కాలుష్యంపై ప్రసంగాలు చేస్తూ అవగాహన కల్పిస్తాడు. గ్జిటెజ్‌కాట్ల్ తన ఫ్రెండ్స్, సోదరుడితో కలిసి సంగీత కచేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోకి తన బృందంతో కలిసి వెళ్లి నాటికలు, ర్యాలీలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తాడు. గ్జిటెజ్‌కాట్ల్ స్టేజ్ షోల ద్వారా ప్రజలకు దగ్గరై పర్యావరణ పరిరక్షణపై షోలు నిర్వహిస్తాడు. వాతావరణ మార్పులు, భూ సంరక్షణ గురించి ప్రసంగాలు ఇస్తూ అందరిచేత పర్యావరణవేత్తగా పిలిపించుకుంటున్నాడు. జీవజాతి మనుగఢ ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రకృతి పచ్చగా ఉండాల్సిందేనని ఎన్నో వేదికలపై తన ప్రసంగాల్ని ఇచ్చాడు. అంతేకాదు, తన గాత్రంతో నీటి వాడకం, సహజ వనరుల పరిరక్షణ, కాలుష్యం వంటి అంశాలను గురించి అవగాహన కల్పిస్తున్నాడు. పలు పాటలకు స్వయాన బాణీలు సమకూరుస్తూ సమాజం పట్ల ప్రజలకుండే బాధ్యతను తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని గురించి విన్న అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా కూడా గ్జిటెజ్‌కాట్ల్ రోస్క్ మార్టింజ్ ని అభినందించారు.