: మైనర్లు, వారి తల్లిదండ్రులకు పోలీసుల కౌన్సెలింగ్.. బుద్ధొచ్చిందన్న మైనర్లు
పోలీసుల స్పెషల్ డ్రైవ్‌లో వాహనాలు నడుపుతోన్న మైనర్లు భారీగా పట్టుబడుతున్నారు. ఇటీవల పట్టుబడిన 250 మంది మైనర్లకు వారి తల్లిదండ్రులతో కలిసి ఈరోజు హైదరాబాద్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. నగరంలోని గోషామహల్ స్టేడియంలో మైనర్లు, వారి తల్లిదండ్రుల చేత పోలీసులు మాట్లాడించారు. ట్రాఫిక్ పోలీసులు మంచి పని చేస్తున్నారని, మన రక్షణ కోసమే వారి ప్రయత్నమని పట్టుబడ్డ మైనర్లు, వారి తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. పోలీసులు ఇస్తోన్న కౌన్సెలింగ్ వారిలో మార్పు తీసుకువస్తుందని వారు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండాక, లైసెన్స్ తీసుకొని మాత్రమే వాహనాలు నడపాలని తమకు తెలిసిందని, బుద్ధిగా పోలీసుల సూచనలు పాటిస్తామని మైనర్లు తెలిపారు. పిల్లలు వాహనాలు ఉపయోగించాల్సిన అవసరం వచ్చినా వాటిని ఉపయోగించరాదని, సైకిళ్లను ఉపయోగించాలని పోలీసులు సూచించారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు చెప్పారు.