: నిన్న విమర్శలు గుప్పించిన వారు ఇప్పుడేమయ్యారు?: మంత్రి కామినేని
విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో జరిగిన శిశువు అపహరణ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కామినేని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్షాలు దురదృష్టకర సంఘటనల్లో ఎంత త్వరగా స్పందిస్తాయో, మంచి జరిగిన సందర్భాల్లోనూ అలాగే స్పందిస్తే బాగుంటుందని ఆయన అన్నారు. నిన్న విమర్శలు గుప్పించిన కమ్యూనిస్టు, కాంగ్రెస్, వైసీపీ నాయకులు ఇప్పడు ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. తప్పుల్ని మాత్రమే ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలు నానా హంగామా చేస్తున్నాయని, పాత ప్రభుత్వం అసమర్థత వల్లే ఇంకా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు లాంటి సౌకర్యాలు లేవని ఆయన పేర్కొన్నారు. నేరం రుజువైతే శిశువుని అపహరించిన నిందితులకి కనీసం ఏడు ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందని కామినేని చెప్పారు. శిశువుని ఎత్తుకెళ్లడం మహా పాపమని, వారికి కఠిన శిక్ష పడాల్సిందేనని అన్నారు. విచారణ తరువాత ఎవరు ఈ తప్పుచేశారో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 36 గంటల్లోనే మిస్టరీని ఛేదించి పోలీసులు పసిబిడ్డ తల్లిదండ్రుల ఆవేదనను తొలగించారని ఆయన అన్నారు. కొందరు వైసీపీ నాయకులు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే కొన్ని సౌకర్యాల కల్పనలో ఆలస్యం జరుగుతోందని ఆయన చెప్పారు.