: అంతర్రాష్ట్ర మండలి భేటీకి అఖిలేశ్, కేజ్రీవాల్ డుమ్మా!
కేంద్రం, రాష్ట్రాల మధ్య పెరుగుతున్న అంతరాలను తొలగించడంలో అంతర్రాష్ట్ర మండలిది కీలక భూమిక. అంతే కాకుండా కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడమనే గురుతర బాధ్యత కూడా ఈ మండలిపై ఉంది. ఇంతటి కీలక ప్రాధాన్యమున్న ఈ మండలి సమావేశం దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మొదలైంది. ఈ సమావేశం కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి తరలివచ్చారు. అయితే ఢిల్లీలోనే ఉన్న ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్, పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ లు మాత్రం ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టేశారు. మోదీ సర్కారుతో ఢీ అంటే ఢీ అంటున్న కారణంగా కేజ్రీ ఈ సమావేశానికి గైర్హాజరవగా, వచ్చే ఏడాది యూపీలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీతో నెలకొన్న వైరం కారణంగా అఖిలేశ్ ఈ భేటీకి డుమ్మా కొట్టారు.