: టర్కీ సైనిక తిరుగుబాటు సైన్యంలోని ఓ వర్గం పనేనట!... ఇబ్బందేమీ లేదని ఎర్డోగాన్ ప్రకటన!
పర్యాటక స్వర్గధామంగా పేరుగాంచిన టర్కీలో సైనిక తిరుగుబాటు ప్రపంచ దేశాలను షాక్ కు గురి చేసింది. అయితే కేవలం గంటల వ్యవధిలోనే సైనిక తిరుగుబాటుకు ఎదురొడ్డి నిలిచి పోరాడుతున్న ఆ దేశ ప్రజలను చూసి ఆ దేశాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అసలు టర్కీలో జరిగిన సైనిక తిరుగుబాటు... పాకిస్థాన్ లో మొత్తం సైన్యమంతా కూడబలుక్కుని చేసిన తరహాది కాదట. రెండు వర్గాలుగా విడిపోయిన సైన్యంలోని ఓ వర్గం ఈ దారుణానికి ఒడిగట్టిందని కాస్తంత ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ వర్గం సైనికులు చేసిన తిరుగుబాటును ఆ దేశ పోలీసులు ప్రజల సహకారంతో తిప్పికొడుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్... తిరుగుబాటుదారులు తోక ముడిచారని, ఇక ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. త్వరలోనే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.