: టీడీపీ నేతపై హత్యాయత్నం!... వెంటాడి కారుతో ఢీకొట్టిన వైనం!
గుంటూరు జిల్లాలో రాజకీయ ప్రత్యర్థులు బరి తెగించారు. టీడీపీ నేతను హత్య చేసేందుకు యత్నించారు. ఒంటరిగా బైక్ పై వెళుతున్న సదరు టీడీపీ నేతను వెంటాడి మరీ కారుతో ఢీకొట్టారు. అయితే తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ టీడీపీ నేత తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వివరాల్లోకెళితే... గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపాలిటీలో కౌన్సిలర్ హోదాలో ఉన్న టీడీపీ నేత బాబురావును నిన్న ఆయన ప్రత్యర్థులు వెంటాడి హత్య చేసేందుకు యత్నించారు. జిల్లాలోని ఫిరంగిపురం కార్మెల్ మాతా ఉత్సవాలకు వెళ్లి నిన్న రాత్రి ఒంటరిగా బైక్ పై తిరిగి వస్తున్న బాబురావును దారి కాచి హత్య చేసేందుకు గుర్తు తెలియని దుండగులు యత్నించారు. ఫిరంగిపురం వద్దే ఆయనను హత్య చేసేందుకు యత్నించినా బాబురావు చాకచక్యంగా తప్పించుకున్నారు. అయితే బాబురావును ఎలాగైనా హత్య చేయాల్సిందేనన్న భావనతో ఆయన బైకును దుండగులు కారులో వెంబడించారు. ఈ క్రమంలో నరసరావుపేట సమీపంలో ఆయన బైకును కారుతో బలంగా ఢీకొట్టారు. దీంతో కిందపడిపోయిన బాబురావు చనిపోయాడనుకుని దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాబురావు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాబురావును ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడ్డ వారు ఎవరన్న విషయం తెలియరాలేదు. దీనిపై సమాచారం అందుకున్న టీడీపీ నేతలు ఆసుపత్రికి వెళ్లి బాబురావును పరామర్శించారు.