: ఓవైసీపై రాజద్రోహం కేసు!... కోర్టు ఆదేశాలతో నమోదు చేసిన సరూర్ నగర్ పోలీసులు!
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై రాజద్రోహం కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు చేేసినట్లు ఎల్బీ నగర్ డీసీపీ తాఫ్సీర్ ఇక్బాల్ నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. భాగ్యనగరిలో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన ఐదుగురు ఉగ్రవాదులను ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు ఉగ్రవాదులకు న్యాయపరమైన సాయం చేసేందుకు తాము సిద్ధమంటూ ఓవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైదరాబాదీ న్యాయవాది కరుణసాగర్ హైదరాబాదు 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా ప్రకటన చేసిన ఓవైసీపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజద్రోహం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఓవైసీపై రాజద్రోహం కేసు నమోదు చేయాల్సిందిగా సరూర్ నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలతో ఓవైసీపై ఐపీసీ సెక్షన్ 124ఏ కింద రాజద్రోహం కేసు పెట్టినట్లు ఇక్బాల్ చెప్పారు.