: పాకిస్థాన్ మరోమారు బరితెగింపు.. బుర్హాన్ కు నివాళిగా 19న బ్లాక్ డే నిర్వహిస్తామన్న షరీఫ్


పాకిస్థాన్ మరోమారు బరితెగింపు వ్యాఖ్యలు చేసింది. భద్రతా దళాల ఎన్ కౌంటర్ లో మరణించిన హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీకి నివాళిగా జూలై 19వ తేదీని బ్లాక్ డేగా పరిగణిస్తామని పేర్కొంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బుర్హాన్ ను ‘కశ్మీరీ నేత’గా పేర్కొన్న ఆయన కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా వచ్చే మంగళవారాన్ని బ్లాక్ డే గా ప్రకటించారు. పాక్ చేష్టలు, వ్యాఖ్యలపై భారత్ మండిపడింది. నిషేధిత సంస్థలను, ఉగ్రవాదులను కీర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలపై సానుభూతి చూపుతున్న పాక్ నిజస్వరూపం ఏంటో బయటపడిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. మరోవైపు శుక్రవారం పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖావాజా ఎం.అసిఫ్ భారత్ కు వ్యతిరేకంగా వరుస ట్వీట్లు చేశారు. ఇటీవల కశ్మీర్ లో చెలరేగిన అల్లర్లను 2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లతో పోలుస్తూ ట్వీట్లు చేశారు. గుజరాత్ అల్లర్లకు కొనసాగింపుగానే మోదీ జాతి ప్రక్షాళన ప్రారంభించారని తీవ్రంగా విమర్శించారు. అయితే ఇటువంటి అభాండాలతో పాక్ నేతలు ఎప్పటికీ విజయం సాధించలేరని వికాస్ స్వరూప్ ఘాటుగా బదులిచ్చారు.

  • Loading...

More Telugu News