: షాకింగ్ న్యూస్... అమరనాథ్ మంచు శివలింగం కరిగిపోయింది?
అమర్ నాథ్ యాత్ర ముగియడానికి ఇంకా 34 రోజుల సమయం ఉండగానే లక్షలాది మంది అమర్ నాథ్ యాత్రికులను దిగ్భ్రాంతికి గురి చేసే వార్త వెలుగుచూసింది. హిమాలయాల్లో సహజసిద్ధంగా రూపుదిద్దుకునే పవిత్ర అమర్ నాథ్ గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయింది. అమర్ నాథ్ యాత్ర ఈనెల 2వ తేదీన ప్రారంభం కాగా ఆగస్టు 18వ తేదీ (రక్షాబంధన్) నాటికి ముగియాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో లక్షలాది మంది శివలింగాన్ని దర్శించుకుంటారు. అయితే ఈనెల 8న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైంది. దీంతో యాత్ర పలు సందర్భాల్లో రద్దయింది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శివలింగాన్ని ఈ ఏడు కేవలం లక్షా 45 వేల మంది మాత్రమే దర్శించుకున్నట్టు తెలుస్తోంది. బిజ్ బెహరా సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ హైవేపై గత బుధవారం 20 మంది అమర్‌నాథ్ యాత్రికులు గాయపడ్డారని తెలియగానే స్థానిక ముస్లింలు కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించి, ప్రాణాలకు తెగించి ప్రైవేటు వాహనాల్లో వారిని ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే మంచు లింగం కరిగిపోయినప్పటికీ యాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం.