: ఈనెల 18న హైదరాబాద్‌కు రానున్న ఆర్బీఐ గవర్నర్‌


ఎన్‌ఐఆర్‌డీ, క్రక్స్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 18న హైద‌రాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ)లో జ‌ర‌గ‌నున్న ఓ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించ‌డానికి భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్‌ రఘురాం రాజన్ రానున్నారు. సమ్మిళిత గ్రామీణాభివృద్ధి సాధన దిశగా కార్పొరేట్‌ పాలనను మెరుగుపరిచేందుకుగాను ఈ స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్‌ఆర్‌బీ) డైరెక్టర్లకు ర‌ఘురాం రాజ‌న్ ప‌లు సూచ‌నలిచ్చి, ప‌లు అంశాల‌పై అవ‌గాహ‌న కల్పించ‌నున్నారు. బ్యాంకుల్లో సుపరిపాలన విధానాలను పటిష్టం చేసుకోవడం, నాయ‌క‌త్వంలో స‌మ‌గ్ర మార్పుల గురించి ఆయ‌న మాట్లాడ‌తారు. ఈ సంద‌ర్భంగా ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డబ్ల్యూఆర్‌ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. తాము నిర్వహించనున్న శిక్ష‌ణ కార్య‌క్ర‌మం గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక, సమ్మిళిత అభివృద్ధికి కృషి చేసేందుకు ఉప‌యోగ‌పడుతుంద‌ని, ఇటువంటి శిక్ష‌ణ కార్యక్ర‌మాన్ని తొలిసారి నిర్వ‌హిస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఆంధ్రాబ్యాంక్‌, ఎస్‌బీహెచ్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూకో బ్యాంక్‌ సహా పలు బ్యాంకుల డైరెక్టర్లు పాల్గొంటార‌ని, ఐఆర్‌డీఏ, పీఎఫ్‌ఆర్‌డీఏ ఛైర్మన్లు సైతం పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News