: కారు ప్రమాదంపై ప్రణబ్ ను ఆరాతీసిన మోదీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురికావడంపై ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతికి ఫోన్ చేశారు. పశ్చిమబెంగాల్ లోని బాగ్ డోగ్రీ విమానాశ్రయానికి వస్తుండగా డార్జిలింగ్ లో ప్రణబ్ కాన్వాయ్ లోని ఓ కారు అదుపుతప్పి వంద అడుగుల లోతు లోయలోకి జారిపోయింది. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సిబ్బంది గాయాలపాలయ్యారు. వారిని రాష్ట్రపతి భద్రతా సిబ్బంది 45 నిమిషాల్లో బయటకు తీసి కాపాడారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో రాష్ట్రపతి ప్రణబ్ కు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన ప్రెస్ సెక్రటరీ వేణు రాజమోని ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెంట పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్ కూడా ఉండడం విశేషం. దీంతో రాష్ట్రపతికి ఫోన్ చేసిన మోదీ ఆయన యోగ క్షేమాలను ఆరా తీశారు.