: సీసీ కెమెరాలు పెట్టారు కదా... నిర్ధారించుకోరా?: శిశువు మిస్సింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మహిళ


సీసీ కెమెరాల్లో కనిపించామన్న ఒకేఒక్క కారణంతో పోలీసులు తమ కుటుంబం ఫోటోలను అనుమానితులంటూ పోస్టర్లలో వేసి తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించడమే కాకుండా, తమను మానసిక వేదనకు గురి చేశారని గుంటూరుకు చెందిన ధాన్యశబరి ఆరోపించారు. తమ బిడ్డకు సంబంధించిన పూర్తి రికార్డులను చూపించిన ఆమె, తమను సమాజంలో తలెత్తుకోనీయకుండా చేశారని మండిపడ్డారు. ఓ టీవీ చానెల్ ఏర్పాటు చేసిన లైవ్ కాన్ఫరెన్స్ లో ఈ మహిళ కుటుంబం... బిడ్డను పోగొట్టుకున్న మహిళ కుటుంబం పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న ధాన్యశబరి మాట్లాడుతూ, నిన్నటి నుంచి తమ కుటుంబంపై టీవీ చానెల్స్ లో ఆరోపణలు సంధించారని, ఆ సమయంలో తాము ఊరు వెళ్లడమే తప్పా? అని ఆమె అడిగారు. అంటే ప్రజలెవరూ పనులు చేసుకోకూడదా? ఎక్కడికీ వెళ్లకూడదా? అని ఆమె నిలదీశారు. అనుమానం వస్తే నిర్ధారణ చేసుకోకుండా పోస్టర్లు వేసేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. సీసీ కెమెరాలు పెట్టారు కదా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్లారు? వంటి వివరాలు తెలుసుకోరా? అని ఆమె పోలీసును నిలదీశారు. జరిగిన పరువు నష్టానికి, మానసిక క్షోభకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను డిమాండ్ చేశారు. ఇలా ఆమె ఒక్కసారిగా ఆగ్రహానికి గురి కావడంతో, మరోపక్క లైవ్ లో వున్న బిడ్డను పోగొట్టుకున్న బాధిత కుటుంబం వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆమె బిడ్డను తమ బిడ్డ అనడం లేదని, అదే సమయంలో ఆమె బస్టాండ్ లో బిడ్డనెత్తుకుని కనిపించడంతో తమకు అనుమానం తలెత్తిందని చెప్పారు. పోలీసులు కూడా అనుమానితులనే పేర్కొన్నారు తప్ప, దొంగలు అనలేదని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి ఆమె మరింత ఆగ్రహానికి గురయ్యారు. అలా ఎలా అంటారని ఆమె మళ్లీ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News