: ఆండ్రీ రస్సెల్ పై నిషేధం తప్పదా?
వెస్టిండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ పై రెండేళ్ల నిషేదం పడేలా కనిపిస్తోంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (డబ్యూఏడీఏ) నిబంధనల ప్రకారం ప్రతి ఆటగాడు ఏడాదిలో మూడు సార్లు స్థానిక యాంటీ డోపింగ్ కమిషన్ ముందు హాజరు కావాలి. ఎవరైనా హాజరు కాని పక్షంలో దానికి సరైన కారణం చూపించాలి. ఆ కారణాన్ని యాంటీ డోపింగ్ కమిషన్ ఆమోదించాలి. ఇలా కాకుండా ఉద్దేశపూర్వకంగా గైర్హాజరైతే అతను డోపింగ్ కు పాల్పడినట్లు నిర్ధారిస్తారు. విండీస్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ (జడ్కో) నిర్వహించే యాంటీ డోపింగ్ టెస్ట్ కు హాజరుకాలేదు. దీంతో ఆ సంస్థ రస్సెల్ వ్యవహారాన్ని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో అతనిపై విచారణకు రంగం సిద్ధమైంది. విచారణలో అతను డోపింగ్ టెస్టులను ఉద్దేశపూర్వకంగానే తప్పించుకున్నాడని తేలితే అతనిపై రెండేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. ఇలా జరిగితే అతని కెరీర్ పై ప్రభావం పడుతుంది. ఐపీఎల్, కరీబియన్ లీగ్, పీసీఎల్ లలో ఆడుతున్న రస్సెల్ విండీస్ జట్టులో కూడా సభ్యుడు కావడం విశేషం.