: టీసీఎస్, ఇన్ఫోసిస్ దెబ్బకు మార్కెట్ కుదేలు!


నిన్న వెల్లడైన టీసీఎస్, నేడు విడుదలైన ఇన్ఫోసిస్ తొలి త్రైమాసికం ఫలితాలు మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును హరించాయి. దీనికితోడు ఐటీ కంపెనీల ఆర్థిక స్థితి కొంత విషమించినట్టు వెల్లడైన విశ్లేషణలు అమ్మకాలకే ఇన్వెస్టర్లు మొగ్గుచూపేలా చేశాయి. దీంతో ఐటీ ఇండెక్స్ 4 శాతానికి పైగా పతనం కాగా, ఆ ప్రభావం బెంచ్ మార్క్ సూచికలపై స్పష్టంగా కనిపించింది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీలు ఆపై 10 గంటలకే నష్టాల్లోకి జారిపోగా, ఆపై మరే దశలోనూ లాభాలు నమోదు కాలేదు. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 105.61 పాయింట్లు పడిపోయి 0.38 శాతం నష్టంతో 27,836.50 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 23.60 పాయింట్లు పడిపోయి 0.28 శాతం నష్టంతో 8,541.40 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.09 శాతం పెరుగగా, స్మాల్ కాప్ 0.74 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 31 కంపెనీలు లాభపడ్డాయి. టాటా స్టీల్, భారతీ ఎయిర్ టెల్, ఐడియా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, అరవిందో ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,875 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 997 కంపెనీలు లాభాలను, 1,579 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గురువారం నాడు రూ. 1,06,30,629 కోట్లుగా నమోదైన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్, నేడు రూ. 1,05,95,306 కోట్లకు తగ్గింది.

  • Loading...

More Telugu News