: మొక్కలకు నీరు పోయడానికి ఫైరింజన్లను ఉపయోగించుకోండి: కేసీఆర్
రాష్ట్రాన్ని హరితవనంలా తయారు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమ పనుల అమలు పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈరోజు హైదరాబాద్‌లో హరితహారం కార్యక్రమంపై తెలంగాణ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కేవలం మొక్కలు నాటేసి వాటిని నిర్లక్ష్యంగా వదిలేయొద్దని ఆయన చెప్పారు. మొక్కలు నాటిన అనంతరం వాటి సంరక్షణపై దృష్టి సారించాలని కేసీఆర్ అన్నారు. మొక్కలకు నీరు పోయడానికి ఫైరింజన్లను సైతం ఉపయోగించుకోవాలని సూచించారు. పంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో నాటిన మొక్కలకు ట్యాంకర్లతో నీరు పోసి వాటిని సంరక్షించాలని ఆయన ఆదేశించారు.