: హరీశ్ అనుకుంటే చేసే తీరుతాడు, వదలడు: నరసింహన్
కొత్తగా తీసుకు వచ్చే ఏ పథకం విజయవంతం కావాలన్నా, సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలను, అధికారులను ముందుండి నడిపించే పాలకపక్ష నేత అవసరమని, ఆ లక్షణాలు హరీశ్ రావులో చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అన్నారు. ఈ మధ్యాహ్నం ఇబ్రహీంపూర్ లో జమ్మి చెట్టు నాటిన గవర్నర్ అనంతరం జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. గ్రామంలో కూరగాయలు పండించే రైతుల ఆదాయ వ్యయాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మరింతగా అభివృద్ధి పనులు జరగాలని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా హరీశ్ వంటి నేతలు ఎంతో అవసరమని అన్నారు. ఆయనో మాట అనుకున్నారంటే చేసే తీరుతారని, లక్ష్యం నెరవేరే వరకూ వదలబోరని, అటువంటి నేత మీకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. అంతకుముందు హరీశ్ రావు మాట్లాడుతూ, గవర్నర్ ది మాటంటే మాట, టైమంటే టైమని పొగిడారు. పదిన్నరకు వస్తానని చెప్పిన ఆయన, అంతకన్నా ముందే వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. వారి నుంచి తామంతా స్ఫూర్తిని పొందుతున్నామని అన్నారు.