: బంపర్ ఆఫర్...రూపాయికే షియోమీ ఫోన్!
భారతీయ మార్కెట్ లోకి చైనా మొబైల్ సంస్థ షియోమీ రంగ ప్రవేశం చేసి రెండేళ్లు కావస్తోంది. ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని షియోమీ బంపర్ ఆఫర్ ను వినియోగదారులకు అందజేయనుంది. జూలై 20 నుంచి 23 వరకు ఈ ఆఫర్ ను అందించనుంది. ప్రతి రోజూ రెండు గంటలకు ఫ్లాష్ సేల్ పేరిట ఫేస్ బుక్ ద్వారా షియోమీ వినియోగదారులకు ఈ ఆఫర్ ను అందించనుంది. ఆఫర్ లో భాగంగా కేవలం రూపాయి ధరకే ఫోన్లు, పవర్ బ్యాంక్ లు, బ్లూటూత్ స్పీకర్లు అందజేయనుంది. తొలిరోజు 10 షియోమీ ఎంఐ ఫోన్లు ఐదు, 100 పవర్ బ్యాంకులు, రెండో రోజు రెడ్ మీ నోట్ 3 ఫోన్లు పది, 100 ఎంఐ బ్యాండ్ లు, ఆఖరి రోజున ఎంఐ మ్యాక్స్ ఫోన్లు పది, 100 ఎంఐ బ్లూటూత్ స్పీకర్లను వినియోగదారులకు అందజేయనుంది. అయితే ఇందుకు సరికొత్త ప్లాన్ రచించింది. ఫేస్ బుక్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. తద్వారా తన వ్యాపారం మరింత విస్తరించుకునేందుకు ప్లాన్ చేసింది. అందుకే యూజర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందనే షరతు విధించింది. దీంతో యూజర్లకు సంబంధించిన సమాచారంతో షియోమీ భవిష్యత్ అడ్వర్టైజ్ మెంట్లను చేసుకునే దిశగా పావులు కదిపింది. ఇంత వరకు కస్టమర్లు ఫ్లిప్ కార్ట్, అమేజాన్, స్నాప్ డీల్ వంటి ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా వీటిని కొనుగోలు చేసేవారు. అలా కాకుండా నేరుగా వినియోగదారులను దగ్గర చేసుకునేందుకు షియోమీ ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. జూలై 19 లోగా పేస్ బుక్ లో రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు ఉంచుతామని షియోమీ తెలిపింది.