: స్నాప్ కార్ట్?... లేకుంటే ఫ్లిప్ డీల్... అమేజాన్ ను దెబ్బకొట్టాలంటే ఏదో ఒకటి రావాల్సిందే!
ఓ విదేశీ సంస్థగా ఇండియాలోకి ప్రవేశించి తిరుగులేని ఆధిపత్యాన్ని చూపుతున్న ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ ను దెబ్బకొట్టాలంటే, దేశవాళీ ఈ -కామర్స్ సంస్థలు స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ విలీనం కావాల్సిందేనని అంటున్నారు ఈ రంగంలోని నిపుణులు. ఈ రెండు కంపెనీల వద్దా ఖర్చు పెట్టేందుకు నిధుల కొరతేమీ లేదు. భారీగా మిగులు నిధులపై కూర్చుని ఉన్నాయి. విడివిడిగా ఉండి విస్తరణ కార్యక్రమాలను గట్టిగానే అమలు చేస్తున్నా, ఆ ప్రభావం దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా మిగులు నిధులతో అమెరికా నుంచి వచ్చి తిష్టవేసిన అమేజాన్ పై ప్రభావం చూపడం లేదు. ఇప్పటికే రూ. 34 వేల కోట్లను ఇండియాలో అభివృద్ధి నిమిత్తం వెచ్చించేందుకు అమేజాన్ సిద్ధంగా పెట్టుకుందంటే, ఇక్కడి అపరిమిత మార్కెట్ పై అమేజాన్ ఎలా కన్నేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అమేజాన్ నుంచి వస్తున్న పెను పోటీని ఎలా తట్టుకోవాలో తెలియని స్థితిలో పలు రాయితీలను దేశవాళీ సంస్థలైన ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ ప్రకటిస్తున్నాయి. తమ వద్ద వస్తు విక్రయాలు జరిపే వారికి మార్జిన్లు తగ్గించుకుని మరీ ఆఫర్లు ఇస్తున్నాయి. అమేజాన్ తో పోలిస్తే తక్కువ మార్కెటింగ్ ఫీజును ఆఫర్ చేస్తున్నా ఈ కంపెనీలు మాధ్యమంగా విక్రయాలు జరిపేందుకు పెద్దగా స్పందన రావట్లేదన్నది నిపుణుల అభిప్రాయం. ఇక అమేజాన్ ను నిలువరించే దిశగా ఈ రెండు సంస్థలూ కలిసిపోనున్నాయని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే, వాటాల పంపకంపై ఇరు కంపెనీల డైరెక్టర్ల మధ్య వచ్చిన విభేదాలు విలీనానికి అడ్డుకున్నాయని తెలుస్తోంది. ఇక ఇవి రెండూ విలీనమైతే, కొత్తగా ఏర్పడే సంస్థకు స్నాప్ కార్ట్, లేదా ఫ్లిప్ డీల్ అనే పేరు పెట్టవచ్చని తెలుస్తోంది.