: మహ్మదాలీతో బాక్సింగ్ చేసిన ఏకైక భారతీయుడు... తన బిడ్డలను మాత్రం ఆటలకు దూరం చేశాడు!
మహ్మదాలీ... ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో దిగ్గజ ఆటగాడు. ఇక ఇండియా నుంచి మహ్మదాలీతో పోరాడిన ఏకైక వ్యక్తి కౌర్ సింగ్. ప్రస్తుతం పంజాబ్ లోని మాల్వా రీజియన్ లో చిన్నకారు రైతుగా ఉన్న కౌర్ సింగ్ 1980లో మహ్మదాలీతో బాక్సింగ్ రింగులో తలపడ్డాడు. ఇండియా తరఫున ఒలింపిక్ పోటీల్లోనూ పాల్గొన్నాడు. 1982లో అర్జున అవార్డును, 1983లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. తన కెరీర్ ఉచ్ఛదశలో ఉన్న వేళ, 1988లో భారత ఆర్మీ విశిష్ట సేవా పతకాన్ని ఇచ్చి సత్కరించింది కూడా. 1982 ఆసియన్ గేమ్స్ ఢిల్లీలో జరిగిన వేళ, వేలాది మంది అభిమానులు ఉత్సాహపరుస్తుంటే, హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ గా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఆపై అతనికి కష్టాలు తెలిసి వచ్చాయి. ఆటను నమ్ముకున్న అతని జీవితం, కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకునేలా చేసింది. 1984లో లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొని వచ్చిన తరువాత తన స్వగ్రామం ఖనాల్ ఖుర్ద్ కే పరిమితమై నాలుగెకరాల భూమిని సాగుచేస్తూ బతుకుతున్నాడు. ఆటను నమ్మి జీవితాన్ని నాశనం చేసుకున్నానని భావించిన కౌర్, తన బిడ్డలను మాత్రం క్రీడలకు దూరంగా పెంచాడు. తనలాగా తన బిడ్డలు కూడా బాధితులు కారాదన్నదే ఆయన అభిమతం. 34 ఏళ్ల క్రితం ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన వేళ, పంజాబ్ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల విరాళం కోసం ఇప్పటికీ ఆయన ఎదురు చూస్తున్నాడంటే, మన పాలకులకు క్రీడాభివృద్ధిపై ఎంతటి చిత్తశుద్ధి, శ్రద్ధ వున్నాయో అర్థం చేసుకోవచ్చు. తన క్రీడా జీవితాన్ని మరింత బాగా మలచుకోవడంలో ప్రభుత్వం నుంచి ఎంతమాత్రమూ సహకారం లభించలేదని, ప్రస్తుతం 67 ఏళ్ల వయసులో తలకు పాగా చుట్టుకుని పొలంలో పనులు చూసుకుంటూ నిర్వేదంగా చెబుతున్నారు. తనకు గుండె సమస్య వచ్చి స్టెంట్ వేయాల్సి వస్తే, భారత ఆర్మీ మాత్రం రూ.3 లక్షల సాయం చేసిందని, ఇది మినహా గత 30 ఏళ్లలో తాను ప్రభుత్వం నుంచి పొందినదేమీ లేదని తెలిపారు. 1971లో ఆర్మీలో చేరేదాకా తనకు బాక్సింగ్ గురించి తెలియదని, 23 ఏళ్ల వయసులో హవల్దార్ గా చేరినప్పటి నుంచి బాక్సింగ్ పై మక్కువ పెంచుకుని 1979 నాటికి జాతీయ చాంపియన్ గా ఎదిగానని కౌర్ గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి 1983 వరకూ వరుసగా నాలుగేళ్లు చాంపియన్ గా నిలిచానని, మహ్మదాలీ భారత్ కు వచ్చిన సందర్భంగా ఢిల్లీ నేషనల్ స్టేడియంలో 50 వేల మంది అభిమానుల మధ్య ఆయనతో ఆడటం తన జీవితంలో మరపురాని రోజని అభివర్ణించాడు. ఇప్పటికైనా ఈ మాజీ బాక్సింగ్ వీరుడికి అందాల్సిన సాయం ప్రభుత్వాల నుంచి అందుతుందని ఆశిద్దాం.