: ‘స్కైప్’ ద్వారా మీడియా ముందుకొచ్చిన జకీర్!... ఆత్మాహుతి దాడులు పాపమంటూ వ్యాఖ్య!
ఇస్లామిక్ మత బోధనలతో ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ రీసెర్చి ఫౌండేషన్ (ఇఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని మదీనాలో ఉన్న ఆయన అక్కడి నుంచే ముంబైలో మీడియా ప్రతినిధులను ఓ చోట కూర్చోబెట్టి ‘స్కైప్’ ద్వారా మాట్లాడారు. అందరూ అనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రదాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఆ దాడిలో పాలుపంచుకున్న ఓ ఉగ్రవాదిని తాను ప్రేరేపించానన్న వాదనలోనూ ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మీడియాలో వచ్చిన కథనాలకు, మీడియా ప్రతినిధులు ఆన్ లైన్ ద్వారా సంధించిన అన్ని ప్రశ్నలకు ఇప్పటికే సమాధానమిచ్చానని చెప్పారు. ప్రజలను చంపమని తానెవరికీ చెప్పలేదని తెలిపారు. ఈ విషయంలో తన వ్యాఖ్యలను, బోధనలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆత్మాహుతి దాడులను ఇస్లామ్ ఎప్పటికీ ప్రోత్సహించదని చెప్పారు. ఇస్లాం ప్రకారం ఆత్మాహుతి దాడులు పాపమని పేర్కొన్నారు. ఇస్లామిక్ మత గురువుగా తాను ఆత్మాహుతి దాడులను ఖండిస్తున్నానని కూడా ఆయన చెప్పారు.