: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష రేసులో అజారుద్దీన్, విజయశాంతి!
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కోలేక రాష్ట్రంలో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలను అందించేందుకు పార్టీ హైకమాండ్ కొత్త రక్తాన్ని ఎక్కించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా టీఎస్ పీసీసీ బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్వయంగా రాహుల్ గాంధీకి సూచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, ఎంపీ అజారుద్దీన్, గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ లో చేరిన సినీనటి విజయశాంతి పేర్లు తెరపైకి వచ్చాయి. అందరికీ ఆమోదయోగ్యమైన, ప్రజల్లో పేరున్న వారికి ఈ పదవిని అప్పగించాలంటే, వీరిద్దరిలో ఒకరైతే బాగుంటుందని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇక వీరిద్దరితో పాటు షబ్బీర్ అలీ, డీకే అరుణ, గీతారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులు సైతం పోటీలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతమున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ పై పలువురు ఇప్పటికే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వైఖరిని ప్రశ్నిస్తూ, పాల్వాయి గోవర్థన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేతలు, ఆరోపణలు చేసి, ఆపై పార్టీ ఫిరాయించారు. విజయశాంతి గ్లామర్, ఉద్యమ నేతగా ఆమెకున్న చరిత్ర ప్రజల్లోకి చొచ్చుకువెళ్లి క్యాడర్ ను కాపాడుకునేందుకు ఉపకరిస్తుందని పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హైకమాండ్ వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో నిర్ణయాత్మక వర్గంగా ఉన్న ముస్లింల ఓట్లను గంపగుత్తగా పట్టాలంటే, ఓ ముస్లిం, అందునా క్రికెటర్ గా ప్రతి ఒక్కరి మనసుల్లో ఉన్న అజారుద్దీన్ అయితే బెస్టని మరికొందరు నేతలు అభిప్రాయ పడుతున్నట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ మనసులో ఏముందో?