: మోదీ కేబినెట్లో మరింత కీలకంగా జూనియర్లు!... విధాన నిర్ణయాల్లో వారికీ స్థానం!
కేంద్ర కేబినెట్ లోని సహాయ మంత్రుల పనేంటంటే... ఆయా మంత్రిత్వ శాఖల రోజువారి వ్యవహారాలు, సదరు శాఖకు సంబంధించి పార్లమెంటులో సభ్యులు వేసే ప్రశ్నలకు బదులివ్వడమే. ఆయా శాఖల విధాన నిర్ణయాల్లో వీరికి ఏమాత్రం పాత్ర వుండదు. దానికి తోడు, సహాయ మంత్రులను ఐఏఎస్ అధికారులు సహా ఇతర సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో సహాయ మంత్రులంతా పేరుకు మాత్రమే మంత్రులుగా... ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతున్నారు. ఈ పరిస్థితి త్వరలో మారనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రెండేళ్ల పాలనపై సమగ్ర విశ్లేషణలో సహాయ మంత్రుల దీనావస్థ ఆయన దృఫ్టికి వచ్చింది. అంతేకాకుండా ఐదేళ్ల పాటు సహాయ మంత్రులుగా ఉన్న వారి పనితీరులో పెద్దగా మార్పేమీ కనిపించే అవకాశాలు కూడా ఆయనకు కనిపించలేదట. దీంతో వ్యవస్థను పూర్తిగా మార్చేందుకు మోదీ నడుం బిగించారు. ఇందులో భాగంగా అన్ని విధాన నిర్ణయాల్లో సహాయ మంత్రులకు కూడా తప్పనిసరిగా అవకాశం కల్పించాలని అన్ని మంత్రిత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సహాయ మంత్రులతో చర్చలు జరిపి, వారితో చర్చించి, వారి అభిప్రాయాలను కూడా కోట్ చేసిన తర్వాతే ఆయా నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను కేబినెట్ భేటీ ముందు పెట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యతో జూనియర్ మంత్రులకు పాలనతో పాటు పార్టీ పరంగానూ మరింత అవగాహన పెరుగుతుందని మోదీ అభిప్రాయం. వెరసి జూనియర్ మంత్రులు మరింత మెరుగ్గా రాణించే అవకాశాలు లేకపోలేదని కూడా మోదీ భావిస్తున్నారు.