: విజయ్ కాంత్ పై ఆరోపణలు చేసే వారు ఎంత మూటగట్టుకున్నారో బయటపెడతాం: డీఎండీకే నేత
డీఎండీకే అధినేత విజయ్ కాంత్ పైన, ఆ పార్టీ పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు ఎంత మూటగట్టుకున్నారో తమకు తెలుసని, ఆ వివరాలను త్వరలోనే బహిర్గతం చేస్తామని ఆ పార్టీ కోశాధికారి ఇళంగోవన్ అన్నారు. డీఎండీకే ఛారిటబుల్ ట్రస్టుకు రూ.500 కోట్ల మొత్తం వచ్చినట్లు ఆ పార్టీ నుంచి వైదొలగిన వి.సి.చంద్రకుమార్. ఆర్.పార్తిబన్ చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఈ విషయాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించగలరా? అని ఇళంగోవన్ వారిని ప్రశ్నించారు. డీఎండీకే నుంచి వైదొలగిన వీరు డీఎంకే నేతల ప్రోద్బలంతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. తమ పార్టీకి వచ్చే ఆదాయం, ఖర్చు వివరాలను క్రమం తప్పకుండా ఆదాయపు పన్ను ఖాతాకు అందజేశామని, డీఎండీకే ఖాతాను, ఛారిటబుల్ ట్రస్టు ఖాతా వివరాలను బహిర్గతం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇళంగోవన్ పేర్కొన్నారు.