: అధికారుల ప్రణాళికా లోపం... ఏపీఎస్ఆర్టీసీకి ‘వడ్డీ’ రూపంలో నష్టం
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసి) అధికారుల ప్రణాళికా లోపం కారణంగా ప్రతి నెలా రూ.2 కోట్ల మేరకు వడ్డీరూపంలో నష్టపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. కొత్తగా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేయడంలో అధికారుల ప్రణాళికలు సరిగా లేవని ఆరోపిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ఇప్పటికే రూ.2 వేల కోట్లకు పైగా అప్పులున్న విషయాన్ని వారు ప్రస్తావించారు. విడతల వారీగా చెల్లింపుల కోసం ఒకేసారి వందల కోట్లు అప్పుతెచ్చి, మళ్లీ ఆ సొమ్మును తక్కువ వడ్డీకి బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం ద్వారా 5 నుంచి 6 శాతం వడ్డీ నష్టపోతోందని విమర్శించారు. కాగా, మూడు వేల కొత్త బస్సుల కొనుగోలు నిమిత్తం హడ్కోతో పాటు ఒక జాతీయ బ్యాంకు నుంచి 11 నుంచి 13 శాతం వడ్డీకి రూ.450 కోట్ల రుణం తీసుకుంది. ఇన్ని బస్సులను ఆయా సంస్థలు ఒకేసారి తయారు చేయలేవు. అంతేకాకుండా, బస్సు ఛాసిస్, బాడీ తయారీ సంస్థలు వాటిని విడతల వారీగా సరఫరా చేస్తాయి. ఇన్ని బస్సుల సరఫరాకు సంవత్సర కాలం పట్టొచ్చని సమాచారం. రుణంగా తీసుకున్న రూ.450 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో ఆర్టీసీ డిపాజిట్ చేసింది. ఈ మొత్తంపై ఆయా బ్యాంకులు 6 నుంచి 7 శాతం వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నాయి. రుణానికి చెల్లిస్తున్న వడ్డీ రేటు, డిపాజిట్ పై వడ్డీ రేటు మధ్య 5-6 శాతం తేడా ఉండటంతో ప్రతి నెలా రూ.2 కోట్ల వరకు నష్టపోతోంది. ఈ విషయమై ఆర్టీసీ వర్గాలు స్పందిస్తూ, తరచుగా బ్యాంకుల నుంచి రుణం పొందడం అంత తేలిక కాదని, అందుకే అంత పెద్ద మొత్తం రుణం ఒకేసారి తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. అయితే, ఈ వాదనతో సంస్థ ఉద్యోగులు విభేదిస్తున్నారు.