: హాహాకారాలు, ఆర్తనాదాలు, తెగిపడ్డ అవయవాలు: నీస్ మారణకాండ ప్రత్యక్ష సాక్షి
ఎటు చూసినా చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు. భయకంపితులైన ప్రజల హాహాకారాలు, తీవ్రంగా గాయపడిన వారి ఆర్తనాదాలు... బాస్టిల్ డే వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న వేళ, ఫ్రాన్స్ లోని నీస్ లో జరిగిన మారణకాండలో కనిపించిన దృశ్యాలివి. ఈ వేడుకలను కవర్ చేసేందుకు వెళ్లిన ఏఎఫ్పీ విలేకరి రాబర్ట్ హాలోవే తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. "పూర్తి గందరగోళ వాతావరణం ఇది. ఎంతో మందిని ట్రక్కు ఢీ కొట్టింది. వారి వస్తువులు గాల్లో ఎగిరిపడ్డాయి. పలువురు గాల్లో పల్టీలు కొడుతూ కిందపడి తీవ్ర గాయాల పాలయ్యారు. ఎగిరి పడుతున్న వస్తువుల నుంచి నా తలను కాపాడుకోవాల్సి వచ్చింది. అత్యంత కిరాతక ఘటన ఇది" అని తెలిపాడు. "దూసుకొస్తున్న ట్రక్కును నేను దగ్గరగా చూశాను. అది నాకు 100 మీటర్ల దూరం వరకూ వచ్చింది. కొన్ని సెకన్ల వ్యవధిలో నా ప్రాణాలు దక్కించుకున్నాను. ఆపై ట్రక్కు చుట్టూ పోలీసు వాహనాలు కనిపించాయి. అంతా ఉత్సాహంగా ఉన్న వేళ, ఈ ఘటనతో ప్రతి ఒక్కరి ఆనందం ఆవిరైంది" అని అన్నారు. ఈ ఘటనను అత్యంత నేర పూరిత దాడిగా నీస్ స్థానిక ప్రభుత్వ ప్రతినిధి సెబాస్టియన్ హంబర్ట్ వ్యాఖ్యానించారు.