: ఫ్రాన్స్ ఉగ్రదాడిపై ప్రపంచం దిగ్ర్భాంతి.. దాడులను ఖండించిన మోదీ, ప్రణబ్
ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో గురువారం రాత్రి పొద్దుపోయాక జరిగిన ఉగ్రదాడిపై ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాస్టిల్ డే వేడుకల్లో పాల్గొన్న వారిని ఉగ్రవాది ఒకడు పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కుతో తొక్కించాడు. ఈ ఘటనలో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 80 మంది మృతి చెందగా వందల సంఖ్యలో గాయపడ్డారు. గతంలో జరిగిన పారిస్ ఉగ్ర దాడి నుంచి ప్రజలు తేరుకుంటుండగానే ఈ ఘటన జరిగింది. దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే తదితరులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దాడి విషయం తెలిసి షాక్ కు గురైనట్టు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇదో మతిలేని చర్య అని పేర్కొన్న మోదీ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఫ్రాన్స్ కు భారత్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బరాక్ పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన డొనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరపున పోటీపడుతున్న అభ్యర్థి) రేపు జరగాల్సిన విలేకరుల సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు. ఉగ్రదాడి వార్త విని షాక్ కు గురైనట్టు బ్రిటన్ ప్రధాని థెరిసా మే పేర్కొన్నారు. నీస్ దాడిని ఐక్య రాజ్యసమితి ఖండించింది. ఉగ్రవాదులది పరికిపంద చర్యగా అభివర్ణించింది.