: వినాయక నిమజ్జనానికి హైదరాబాద్ లో పది కోనేర్లు
వినాయక విగ్రహాల నిమజ్జనానికి బెంగళూరు మహా నగర పాలక సంస్థ (బీబీఎంపీ) ఏర్పాటు చేసిన కోనేర్లు మాదిరిగానే హైదరాబాద్ లో కూడా ప్రయోగాత్మకంగా కోనేర్లను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. మొదటి విడతలో పది కోనేర్లను నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు కార్యనిర్వాహక ఇంజనీరు శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో ప్రారంభమయ్యే పనులు సెప్టెంబరు 4వ తేదీలోపు పూర్తయి, కోనేర్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ పది కోనేర్లు నిర్మించే స్థలాల విషయానికొస్తే... సంజీవయ్య పార్కు, ఊర చెరువు- కాప్రా, చెర్లపల్లి చెరువు- ఘట్ కేసర్, పరికి చెరువు- కూకట్ పల్లి, పెద్దచెరువు- గంగారం, వెన్నెల చెరువు- జీడిమెట్ల, రంగథాముని కుంట, మల్కం చెరువు - రాయదుర్గం, నల్లగొండ చెరువు, లార్జ్ ట్యాంక్, సరూర్ నగర్ లో ఈ కోనేర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. వినాయక చవితికి జంటనగరాల పరిధిలో ప్రతి ఏటా కొలువుదీరే వినాయక విగ్రహాలు సుమారు 70 నుంచి 80 వేల వరకు ఉండగా, 5 అడుగులు అంతకన్నా ఎక్కువ ఎత్తు ఉండే విగ్రహాలు 45,000 వరకు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కాగా, వినాయక చవితికి వేల సంఖ్యలో విగ్రహాల్ని భక్తులు హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తుంటారని, వాటిని మళ్లీ బయటకు తీసేందుకు 52 క్రేన్ లను వినియోగిస్తుంటామని చెప్పారు. నెక్లెస్ రోడ్ లోని కొన్ని ప్రాంతాల్లో నిమజ్జనమయ్యే విగ్రహాలను మినహాయిస్తే 80 శాతం విగ్రహాలు హుస్సేన్ సాగర్ లోనే ఉండిపోతాయని అధికారులు చెబుతున్నారు.