: మరింత క్రియాశీలంగా నారా లోకేశ్!... పార్టీ ఎమ్మెల్యేలతో త్వరలో వ్యక్తిగత భేటీ!


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరింత క్రియాశీలంగా మారనున్నారు. ఇప్పటికే పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న ఆయన ఇక ఎమ్మెల్యేల పనితీరుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏపీలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ ప్రస్తుత స్థితి ఏమిటన్న విషయంపై పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా సర్వే చేయించిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో పార్టీ పరిస్థితి బాగా లేని నియోజకవర్గాల సంఖ్యే ఎక్కువగా ఉందన్న విషయం అటు చంద్రబాబుతో పాటు ఇటు లోకేశ్ ను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆయా నియోజక వర్గాల ఇన్ చార్జీలతో చంద్రబాబు నేరుగా భేటీ కావాలని నిర్ణయించారు. అయితే మొత్తం 175 మందితో భేటీ కారణంగా చాలా సమయం పడుతుందన్న భావనతో ఆయన లోకేశ్ ను రంగంలోకి దించారు. మంత్రులతో మాత్రమే తాను వ్యక్తిగత సమావేశాలు నిర్వహిస్తానని చెప్పిన చంద్రబాబు... ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలతో భేటీల బాధ్యతను లోకేశ్ కు అప్పగించారు. చంద్రబాబు రష్యా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన వెంటనే ఈ భేటీలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ భేటీల్లో ఆయా నియోజక వర్గాల్లో పార్టీ ప్రస్తుత స్థితి, దానిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లోకేశ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

  • Loading...

More Telugu News