: రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే నా బిడ్డ దక్కదు: హర్షిత తల్లి
రంగారెడ్డి జిల్లా జగద్గిరిగుట్టకు చెందిన చిన్నారి హర్షిత కాలేయ వ్యాధితో బాధపడుతుండటంతో పాప తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కూతురుకు ఆపరేషన్ చేయించే ఆర్థిక స్తోమత తమకు లేదని, తమ కుమార్తె కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ హైదరాబాద్ లో హెచ్చార్సీని హర్షిత తల్లిదండ్రులు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక టీవీ ఛానెల్ లో హర్షిత తల్లి శ్యామల మాట్లాడుతూ, తమ పాపకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారని, అందుకు రూ.25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చవుతుందని ఏసియన్ ఆసుపత్రి వైద్యులు చెప్పారని, అంత ఆర్థిక స్తోమత తమకు లేదని, దీంతో ఏమి చేయాలో తెలియక అక్కడి నుంచి బయటకు వచ్చేశామన్నారు. ఆ తర్వాత కేర్ ఆసుపత్రికి వెళితే అక్కడి వైద్యులు తమ కూతురుకి పరీక్షలు నిర్వహించారని, మందుల ద్వారా తగ్గుతుందేమోనని చూశారని.. అది సాధ్యపడలేదని, హర్షితకు ఆపరేషన్ చేస్తేగాని బతకదని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. పాప పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని, రెండు వారాల్లో ఆపరేషన్ చేయకపోతే హర్షిత తమకు దక్కదని చెప్పారంటూ ఆమె తల్లి ఏడుస్తూ చెప్పింది.