: ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు... ఐసీయూ అద్దాలు పగులకొట్టి బంధువుల ఆందోళన


విజ‌య‌వాడ‌లోని పాత ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స కోసం తీసుకొచ్చిన ఓ శిశువుని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఎత్తుకెళ్లారు. త‌మ బిడ్డ‌ ఆసుప‌త్రిలో క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో ఆ శిశువు త‌ల్లిదండ్రులు సుబ్రహ్మణ్యం, కల్యాణి తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. వారం రోజుల క్రితం మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన క‌ల్యాణి ఆ శిశువుకి కామెర్లు సోక‌డంతో ఆస్పత్రిలోని నవజాత శిశు చికిత్స కేంద్రంలో చికిత్స కోసం చేర్పించింది. శిశువుని చికిత్స నిమిత్తం వైద్యులు నాలుగు రోజులుగా ఇంక్యుబేటర్‌లో ఉంచారు. అయితే, శిశువు వ‌ద్ద త‌ల్లిదండ్రులు లేని స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఎత్తుకెళ్లారు. దీనిపై సిబ్బంది త‌మ‌కేమీ తెలియ‌ద‌ని చెబుతున్నారు. ఆసుప‌త్రిలో సీసీ కెమెరాలు కూడా ప‌నిచేయ‌డం లేదు. అయితే ఎవ‌రో ఓ మ‌హిళ చిన్నారిని ఎత్తుకెళ్లిన‌ట్లు అక్క‌డి వారు చెబుతున్నారు. దీనిపై స్పందించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య‌, ఆరోగ్య శాఖ‌ మంత్రి కామినేని శ్రీనివాస్ శిశువు అదృశ్య‌మ‌యిన ఘ‌ట‌న‌పై నివేదిక ఇవ్వాల‌ని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. చిన్నారి అదృశ్యం ఘ‌ట‌న‌పై మ‌హిళా సంఘాలు, తల్లిదండ్రుల బంధువులు, ప‌లువురు రాజ‌కీయ నేత‌లు ఆందోళ‌న తెలుపుతున్నారు. ఆసుప‌త్రికి చేరుకొని ఐసీయూ తలుపులు బ‌ద్దలు కొట్టారు. మంత్రి కామినేని రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఆసుప‌త్రి సిబ్బందే త‌మ బిడ్డ‌ను మాయం చేశార‌ని ఆరోపిస్తున్నారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో అక్క‌డ భారీగా పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి.

  • Loading...

More Telugu News